||భగవద్గీత ||

||తొమ్మిదవ అధ్యాయము||

||రాజ విద్యా రాజగుహ్య యోగము- శ్లోకాలు - అర్థతాత్పర్యాలతో ||


||ఓమ్ తత్ సత్||
భగవద్గీత
తొమ్మిదవ అధ్యాయము
రాజ విద్యా రాజగుహ్య యోగము
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః|

కృష్ణుడు తొమ్మిదవ అధ్యాయము అర్జునికి అశుభమునుంచి విముక్తికాగల విజ్ఞానముతో కూడిన జ్ఞానమును చెప్పుతాను అంటు మొదలెడతాడు.

శ్లోకము 1
శ్రీ భగవానువాచ:

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే|
జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్||1||

స|| యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్ష్యసే (తత్) ఇదం గుహ్యతమం విజ్ఞానసహితమ్ జ్ఞానం అనసూయవే తే ప్రవక్ష్యామి || 1||

ప్రతిపదార్థాలు:

యత్ జ్ఞాత్వా అశుభాత్ మోక్ష్యసే - ఏది తెలిసికొంటే అశుభము నుంచి విముక్తుడవు కాగలవో
(తత్) ఇదం గుహ్యతమం -( అట్టి) ఈ అతి రహస్యమైన
విజ్ఞానసహితమ్ జ్ఞానం - విజ్ఞానము తో కూడిన జ్ఞానమును,
అనసూయవే తే ప్రవక్ష్యామి - అసూయలేనివాడా నీకు చెప్పుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"ఏది తెలిసికొంటే అశుభము నుంచి విముక్తుడవు కాగలవో ( అట్టి) ఈ అతి రహస్యమైన, విజ్ఞానము తో కూడిన జ్ఞానమును,
అసూయలేనివాడా, నీకు చెప్పుచున్నాను."||1||

ఇది విన్నమాటేనా అనిపించవచ్చు.

శ్రీకృష్ణుడు ఏడవ అధ్యాయములో, అంటే విజ్ఞాన యోగములోకూడా, అర్జునితో నాయందు ఆశక్తి కలవాడవు కనక -"అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు" అంటే "నిస్సందేహముగా పూర్తిగా నన్ను ఎట్లు తెలిసికొనగలవో అది వినుము"అంటూ మొదలెట్టి , "యత్ జ్ఞాత్వా న ఇహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే" -అంటే ఏది తెలిసికోంటే ఈ ప్రపంచములో ఇంకో తెలిసికొనతగినది ఉండదో అట్టి జ్ఞానమును చేపుతాను అంటాడు.

అప్పుడు తన "అపరా" ప్రకృతి ( భూమి రాపో నలో వాయు..), దానికన్నా మించిన జీవ రూపమైనట్టి "పరా" ప్రకృతి గురించి చెపుతాడు. ఆ "పరా" ప్రకృతే జీవభూతములన్నిటికీ ఆధారమని , పరా అపరా ప్రకృతులే సమస్త జడ చైతన్య భూతములకు కారణమని చెపుతాడు.

తన (బ్రహ్మము యొక్క) సర్వవ్యాపకత్వము విశదీకరిస్తూ అన్ని భూతములలో తనే బీజమని కూడా చెపుతాడు.

అట్టి తనస్వరూపమును అజ్ఞానము మాయ వలన అందరూ తెలిసికోనలేకపోతున్నారు, ఏవెరైతే ఆ మాయను దాట కలుగుతున్నారో వాళ్ళు తరించుచున్నారు , ఎవరైతే భవంతుని ఆశ్రయించెదరో వారు తమ ఆత్మస్వరూపమును , సమస్త నిష్కామ కర్మలను బ్రహ్మమే అని తెలిసికొనెదరు అని కృష్ణుడు చెపుతాడు.

అధ్యాయము చివరిలో ఏవరైతే అధిభూత అధిదైవ అధియజ్ఞముతో కూడిన నన్ను తెలిసికొనుచున్నారో వారు అంతిమ ఘడియలలో కూడా నిలుకడ కల మనస్సు కలవారై నన్ను తెలిసికొందురు అని అంటే, అర్జునుడికి మళ్ళీ అధిభూతము, అధిదైవము , అధ్యాత్మము అంటే ఏమిటీ అని సందేహము వస్తుంది. ఆసందేహాలు అన్ని ఎనిమిదవ అధ్యాయములో కృష్ణుడు విశదీకరిస్తాడు. అలా విశదీకరిస్తూ కృష్ణుడు అంత్యదశలో యోగధారణచేసి బ్రహ్మరంధ్రములో ప్రాణవాయువునునుంచి ఓం అంటూ దేహమును వదులు తాడో అట్టివారు మోక్షముపొందుతారు అని చెపుతాడు. అది చాలా మందికి కష్టమైన పని అని, మోక్షమును సులభముగా పోందగల మార్గము తనని అరాధించడమే అని కూడా చెపుతాడు.

అంతా విని ఎనిమిదవ అధ్యాయము చివరికి మోక్షసాధనము కష్టమా అన్న భయముతో కూడిన సందేహము రావచ్చు.

అది తీర్చడము కోసమా అన్నట్లు విజ్ఞానయోగములో మొదటి శ్లోకములో చెప్పిన లాగానే, అంటే ఏది తెలిసికోంటే ఈ ప్రపంచములో ఇంకో తెలిసికొనతగినది ఉండదో అట్టి జ్ఞానమును గురించి చెపుతాను అన్నమాట మళ్ళీ తొమ్మిదవ అధ్యాయములో ప్రస్తావిస్తాడు.

అదే రాజవిద్యా రాజగుహ్య యోగము.

శ్లోకము 2

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్|
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్||2||

స|| ఇదం రాజవిద్యా రాజగుహ్యం ఉత్తమమ్ పవిత్రమ్ ప్రత్యక్షావగమమ్ ధర్మ్యమ్ కర్తుమ్ సుసుఖమ్ అవ్యయమ్ ||2||

ప్రతిపదార్థాలు:

రాజవిద్యా - విద్యలలో శ్రేష్ఠ మైనది
రాజగుహ్యం - పరమ రహస్యమైనది
ఉత్తమమ్ పవిత్రమ్ - ఉత్తమ మైనది పవిత్రమైనది
ప్రత్యక్షావగమమ్ - ప్రత్యక్షముగా తెలిసికొనతగినది,
ధర్మ్యమ్- ధర్మయుక్తమైనది,
కర్తుమ్ సుసుఖమ్ - చేయుటకు మిక్కిలి సులభమైనది,
అవ్యయమ్- నాశనము లేనిది.

శ్లోక తాత్పర్యము:

తా|| "ఇది విద్యలలో శ్రేష్ఠ మైనది, పరమ రహస్యమైనది, ఉత్తమ మైనది, పవిత్రమైనది, ప్రత్యక్షముగా తెలిసికొనతగినది, ధర్మయుక్తమైనది, నాశనము లేనిది, చేయుటకు మిక్కిలి సులభమైనది." ||2||

రాజవిద్యా అంటే ఉన్నతమైన లేక శ్రేష్ఠమైన విద్య . అదే అధ్యాత్మ విద్య.
గుహ్యము అంటే రహస్యము అందులో రాజగుహ్యము అంటే పరమ రహస్యము అన్నమాట.
అధ్యాత్మవిద్య అందరికీ తెలియని విషయము.

బ్రహ్మ జ్ఞానము గురించి చెప్పడమే ఈ అధ్యాయము యొక్క ముఖ్య విషయము.

ఇకడ భగవానుడు అర్జునునకు బ్రహ్మజ్ఞానమును గూర్చి చెప్పుచున్నాడు. ఇది విద్యలలో కెల్ల శ్రేష్ఠమైనది. అతి రహస్యమైనది. అతి పవిత్రమైనది. ధర్మయుక్తమైనది. సులభముగా అచరించ తగినది. నాశరహితమైనది. ప్రత్యక్షరమైనది. ఇది వినుటకు చిత్తశుద్ధికలిగిన అసూయలేనివారే అర్హులు. అందుకనే కృష్ణుడు అర్జునిని "అసూయ లేని వాడా" అని సంబోధిస్తాడు.

శ్లోకము 3

అశ్రద్ధధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప|
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యు సంసారవర్త్మని||3||

స|| హే పరన్తప! అస్య ధర్మస్య అశ్రద్ధధానాః పురుషాః మాం అప్రాప్య మృత్యుసంసారవర్త్మని నివర్తన్తే ||3||

ప్రతిపదార్థాలు:

ధర్మస్యాస్య- అస్య ధర్మస్య- ఈ ధర్మమునందు
అశ్రద్ధధానాః పురుషా - శ్రద్ధలేనట్టి పురుషులు
మాం అప్రాప్య - నన్ను పొందక,
మృత్యుసంసారవర్త్మని- ఈ మృత్యురూపమైన సంసారమార్గములో
నివర్తన్తే - తిరిగి పుట్టుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

" ఈ ధర్మమునందు శ్రద్ధలేనట్టి పురుషులు నన్ను పొందక,
ఈ మృత్యురూపమైన సంసారమార్గములో తిరిగి పుట్టుచున్నారు." ||3||

అంటే శ్రద్ధలేని మనుష్యులు రహస్యమైన ఈ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము పొందక, సంసారమార్గములో పునర్జన్మలతో తిరుగుచున్నారు అని.

శ్లోకము 4

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా|
మత్థ్సాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః||4||

స|| ఇదం సర్వం జగత్ అవ్యక్తముర్తినా మయా తతమ్ | సర్వభూతాని మత్థ్సాని | అహం తేషు న అవస్థితః ||4||

ప్రతిపదార్థాలు:
.
ఇదం సర్వం జగత్ - ఈ సమస్త జగత్తు
అవ్యక్తమూర్తినా మయా తతమ్ - అగోచరమైన నా చేత వ్యాపింపబడినది.
సర్వభూతాని మత్థ్సాని - సమస్త భూతములు నాయందున్నవి.
అహం తేషు న అవస్థితః- నేను వాటియందు లేను.

శ్లోక తాత్పర్యము:

"ఈ సమస్త జగత్తు అగోచరమైన నా చేత వ్యాపింపబడినది.
సమస్త భూతములు నాయందున్నవి. నేను వాటియందు లేను."||4||

ఇక్కడ 'నేను' అని పలుకుతున్న వాసుదేవుడు గోచరుడై అయినా, ఆ సర్వాంతర్యామి అయిన పరమాత్మ స్వరూపము అగోచరమే. "నేను వాటియందు లేను" అన్నమాటలో, మనలో దేముడు లేడా అన్నప్రశ్నరావచ్చు. పరమాత్మ అవినాశి అంటే నాశనము లేని వాడు. అలాంటి అవినాశి మన నాశనమయ్యే దేహములో లేడు. కాని నాశనము లేని మన ఆత్మలో వుంటాడు. ఇక్కడ "నేను వాటి యందు లేను" అన్నమాట, వాటి నాశనము కల దేహము లో ఉండదు అని అర్థము చేసుకోవాలి. ఇంకోక చోట మనలో అన్నప్పుడు, మన నాశనములేని ఆత్మలో అని చెప్పబడినప్పుడు, మన ( ఆత్మలో) భవంతుడు వున్నాడు.

శ్లోకము 5

న చ మత్థ్సాని భూతాని పశ్యమే యోగమైశ్వరమ్|
భూతభృన్నచ భూతస్థో మమాత్మా భూతభావనః||5||

స|| భూతాని మత్థ్సాని న చ | మే ఐశ్వరమ్ యోగమ్ పశ్య | మమ ఆత్మా భూతభృత్ భూతభావనః అపి భూతస్థః న చ||

ప్రతిపదార్థాలు:

భూతాని మత్థ్సాని న చ - ప్రాణులు నాయందు వుండునవి కావు.
మే ఐశ్వరమ్ యోగమ్ పశ్య - నా ఈశ్వర సంబంధమైన యోగమహిమను చూడుము.
మమ ఆత్మా - నా అత్మ( స్వరూపము)
భూతభృత్- ప్రాణి కోట్లను భరించునదియు,
భూతభావనః- ప్రాణికోట్లను ఉత్పన్నమొనర్చునదియూ ( అయిననూ)
భూతస్థః న చ- ప్రాణికోట్ల యందు ఉండునది కాదు.

శ్లోక తాత్పర్యము:

"ప్రాణులు నాయందు వుండునవి కావు. నా ఈశ్వర సంబంధమైన యోగమహిమను చూడుము.
నా అత్మ స్వరూపము ప్రాణి కోట్లను భరించునదియు, ప్రాణికోట్లను ఉత్పన్నమొనర్చునదియూ అయిననూ
ప్రాణికోట్ల యందు ఉండునది కాదు."|| 5||

ఎనిమిదవ శ్లోకములో "భూతగ్రామమిమం సర్వం" ప్రాణి సముదాయమును మరల మరల సృష్ఠించుచున్నా, సాక్షి వలె నున్నభగవంతుని ఆ కర్మలు బంధించవు అని చెప్పబడుతుంది. సృష్ఠి లో సాక్షిగా వున్న, సృష్ఠి తో సంగము లేని పరమాత్మలో ఆ ప్రాణులు వుండవు.

అసత్ పదార్థములో సత్ పదార్థము వుండదు. అంటే నశించిపోగల పదార్థములో నాశనములేని పదార్థము వుండదు. అంటే నశించిపోగల ప్రాణుల లో నశించి పోలేని పరమాత్మ స్వరూపము వుండదు అని కూడా చెప్పవచ్చు.

శ్లోకము 6

యథాఽఽకాశస్థితో నిత్యం వాయుస్సర్వత్రగో మహాన్|
తథా సర్వాణి భూతాని మత్థ్సానీత్యుపధారయ ||6||

స|| యథా సర్వత్రగః మహాన్ వాయుః నిత్యం ఆకాశస్థితః తథా సర్వాణిభూతాని మత్థ్సాని ఇతి ఉపధారయ||

ప్రతిపదార్థాలు:

యథా సర్వత్రగః మహాన్ వాయుః - ఏ విధముగా సర్వత్ర వ్యాపించి యున్న వాయువు
నిత్యం ఆకాశస్థితః - ఎల్లప్పుడు ఆకాశములో వుండునో,
తథా సర్వాణిభూతాని - అదే విధముగా సమస్తములైన ప్రాణులూ,
మత్థ్సాని ఇతి ఉపధారయ- నాయందు వున్నవి అని తెలిసికొనుము.

శ్లోక తాత్పర్యము:

"ఏ విధముగా సర్వత్ర వ్యాపించి యున్న వాయువు ఎల్లప్పుడు ఆకాశములో వుండునో,
అదే విధముగా సమస్తములైన ప్రాణులూ, నాయందు వున్నవి అని తెలిసికొనుము." || 6||

శ్లోకము 7

సర్వ భూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్||7||

స||హే కౌన్తేయ| సర్వభూతాని కల్పక్షయే మామికాం ప్రకృతిం యాన్తి | కల్పస్య ఆదౌ తాని పునః అహమ్ విసృజామి|

ప్రతిపదార్థాలు:

సర్వభూతాని కల్పక్షయే - సమస్త ప్రాణులూ కల్పాంతరమున( ప్రళయకాలములో)
మామికాం ప్రకృతిం యాన్తి - నాయొక్క ప్రకృతిని పొందుచున్నవి.
కల్పస్య ఆదౌ తాని - సృష్ఠి కాలమున వానిని,
పునః అహమ్ విసృజామి- మళ్ళీ నేను సృష్ఠించుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"సమస్త ప్రాణులూ కల్పాంతరమున( ప్రళయకాలములో) నాయొక్క ప్రకృతిని పొందుచున్నవి.
సృష్ఠి కాలమున వానిని మళ్ళీ నేను సృష్ఠించుచున్నాను."|| 7||

శ్లోకము 8

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః|
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్||8||

స|| ప్రకృతేః వశాత్ అవశమ్ ఇమం కృత్స్నం భూతగ్రామమ్ స్వామ్ ప్రకృతిం అవష్టభ్య పునః పునః విసృజామి||8||

ప్రతిపదార్థాలు:

ప్రకృతేః వశాత్ - ప్రకృతికి వశములో నున్న
అవశమ్ ఇమం కృత్స్నం భూతగ్రామమ్ - అవశులైన ఈ సమస్త భూతసముదాయములు
స్వామ్ ప్రకృతిం అవష్టభ్య - నా ప్రకృతి ని అనుసరించి
పునః పునః విసృజామి- మరల మరల పుట్టించుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"ప్రకృతికి వశములో నున్న అవశులైన ఈ సమస్త భూతసముదాయములను,
నా ప్రకృతి ని అనుసరించి మరల మరల పుట్టించుచున్నాను." || 8||

శ్లోకము 9

న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనంజయ|
ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు||9||

స|| హే ధనంజయ ! తేషు కర్మసు అసక్తం ఉదాసీనవత్ ఆసీనమ్ మామ్ తాని కర్మాణి న నిబధ్నన్తి||9||

ప్రతిపదార్థాలు:

తేషు కర్మసు అసక్తం - ఆ కర్మలయందు ఆసక్తి లేనివాడనై
ఉదాసీనవత్ ఆసీనమ్ మామ్ - ఉదాసీనునివలె వున్న నన్ను,
తాని కర్మాణి న నిబధ్నన్తి- ఆ కర్మలు నన్ను బంధింపవు.

శ్లోకతాత్పర్యము:

"ఆ కర్మలయందు ఆసక్తి లేనివాడనై ఉదాసీనునివలె వున్న నన్ను,
ఆ కర్మలయందు ఆసక్తి లేనివాడనై ఉదాసీనునివలె వున్న నన్ను, ఆ కర్మలు నన్ను బంధింపవు." || 9||

శ్లోకము 10

మయాఽధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరమ్|
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే||10||

స||హే కౌన్తేయ మయా అధ్యక్షేన ప్రకృతిః సచరాచరం సూయతే | అనేనహేతునా జగత్ విపరివర్తతే||10||

ప్రతిపదార్థాలు:

మయా అధ్యక్షేణ- అధ్యక్షుడుగా వున్న నాచేత
ప్రకృతిః సచరాచరం సూయతే - ప్రకృతి సమస్త చరాచరములను పుట్టించుచున్నది.
అనేనహేతునా- ఈ కారణము చేత
జగత్ విపరివర్తతే- జగత్తు ప్రవర్తించుచున్నది..

శ్లోక తాత్పర్యము:

"అధ్యక్షుడుగా వున్న నాచేత ప్రకృతి సమస్త చరాచరములను పుట్టించుచున్నది.
ఈ కారణము చేత జగత్తు ప్రవర్తించుచున్నది." || 10||

శ్లోకము 11

అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్|
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్||11||

స|| మమ పరం భావం( తత్త్వం) అజానన్తః మూఢాః భూతమహేశ్వరమ్ మానుషీం తనుం ఆశ్రితమ్ మామ్ అవజానన్తి ||11||

ప్రతిపదార్థాలు:

మమ పరం భావం( తత్త్వం) అజానన్తః - నా పరమ తత్త్వమును తెలిసికొనలేక
మూఢాః - మూఢులు
భూతమహేశ్వరమ్-సమస్త ప్రాణులకు ఈశ్వరుడనగు నన్ను
మానుషీం తనుం ఆశ్రితమ్ మామ్ - మనుష్య దేహమును ఆశ్రయించిన నన్ను
అవజానన్తి - అలక్ష్యము చేయుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

"సమస్త ప్రాణులకు ఈశ్వరుడనగు నన్ను, నా పరమ తత్త్వమును తెలిసికొనలేక, మూఢులు,
మనుష్య దేహమును ఆశ్రయించిన నన్ను అలక్ష్యము చేయుచున్నారు." ||11||

శ్లోకము 12

మోఘశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః|
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః||12||

స|| మోఘశాః మోఘకర్మాణః మోఘజ్ఞానాః విచేతసః మోహినీం రాక్షసీమ్ అసురీం చ (స్వ) ప్రకృతిం ఏవ శ్రితాః ||

ప్రతిపదార్థాలు:

మోఘాశా - మోహముతో కూడిన ఆశలు గలవారు
మోఘకర్మాణో - మోహముతో కూడిన కర్మలు చేయు వారు
మోఘజ్ఞానా - మోహముతో కూడిన జ్ఞానము కలవారు
విచేతసః - బుద్ధి హీనులు
మోహినీం - మోహము కలుగ చేయునదియు
రాక్షసీమ్- రాక్షస సంబంధమైనదియు
అసురీం చ - అసురసంబంధమైన
ప్రకృతిం ఏవ శ్రితాః - స్వభావమునే ఆశ్రయించి వున్నారు.

శ్లోక తాత్పర్యము:

"మోహముతో కూడిన ఆశలు గలవారు, మోహముతో కర్మలు చేయు వారు, మోహము తో కూడిన జ్ఞానము కలవారు, బుద్ధి హీనులు,
మోహము కలుగ చేయునదియు, రాక్షస సంబంధమైనదియు, అసురసంబంధమైన
స్వభావమునే ఆశ్రయించి వున్నారు." ||12||

వీళ్లందరూ ( అంటే అసుర ప్రకృతి ని ఆశ్రయించినవారు తదితరులు) - అవజానన్తి - ఆత్మని అలక్ష్యము చేయు చున్నారు.
అలా అలక్ష్యము చేయని వారు దైవసంబంధమైన ప్రకృతిని ఆశ్రయించిన వారు అన్నమాట

శ్లోకము 13

మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః|
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్||13||

స|| హే పార్థ ! మహాత్మనః తు దైవీం ప్రకృతిం ఆశ్రితాః మామ్ భూతాదిమ్ అవ్యయం జ్ఞాత్వా అనన్యమనసః (మాం) భజన్తి ||

ప్రతిపదార్థాలు:

మహాత్మనః తు దైవీం ప్రకృతిం ఆశ్రితాః -
మహాత్ములు దైవ ప్రకృతినే ఆశ్రయించుచున్నారు.
మామ్ భూతాదిమ్ అవ్యయం జ్ఞాత్వా -
నన్ను, సమస్త ప్రాణులకు కారణ భూతునిగా, వినాశము లేనివానిగా తెలిసి కొని
అనన్యమనసః (మాం) భజన్తి - ఏకాగ్రతతో నన్ను పూజించు చున్నారు.

శ్లోక తాత్పర్యము:

"మహాత్ములు దైవ ప్రకృతినే ఆశ్రయించుచున్నారు.
నన్ను, సమస్త ప్రాణులకు కారణ భూతునిగా, వినాశము లేనివానిగా తెలిసి కొని
ఏకాగ్రతతో నన్ను పూజించు చున్నారు."||13||

దైవ ప్రకృతికలవారు ఇంకా ఏమి చేస్తారు అన్నది 14 వ శ్లోకములో.

శ్లోకము 14

సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః |
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే||14||

స|| సతతమ్ మామ్ కీర్తియంతః దృఢవ్రతాః యతన్తః చ భక్త్యా నమస్యన్తః చ నిత్యయుక్తాః మామ్ ఉపాసతే||14||

ప్రతిపదార్థాలు:

సతతమ్ మామ్ కీర్తియంతః - ఎల్లప్పుడు నన్నే కీర్తించుచూ
దృఢవ్రతాః- చలించని వ్రతములు కలవారై,
యతన్తః చ - ప్రయత్నించుచూ
భక్త్యా నమస్యన్తః చ - భక్తితో నమస్కరించుచూ,
నిత్యయుక్తాః మామ్ ఉపాసతే- ఏకాగ్రచిత్తులై నన్ను సేవించుచున్నారు.

శ్లోకతాత్పర్యము:

" ఎల్లప్పుడు నన్నే కీర్తించుచూ, చలించని వ్రతములు కలవారై ప్రయత్నించుచూ
భక్తితో నమస్కరించుచూ, ఏకాగ్రచిత్తులై నన్ను సేవించుచున్నారు." || 14||

శ్లోకము 15

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే|
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖమ్||15||

స|| అన్యే అపి జ్ఞాన యజ్ఞేన యజన్తః ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖమ్ మామ్ ఉపాసతే||15||

ప్రతిపదార్థాలు:

అన్యే అపి జ్ఞాన యజ్ఞేన యజన్తః - మఱికొందరు జ్ఞానయజ్ఞముతో పూజించుచున్నారు.
ఏకత్వేన- అహంబ్రహ్మాస్మి అనే అద్వైత భావముతోనూ
పృథక్త్వేన- బ్రహ్మమే వివిధరూపములు గలవాడను ద్వైత భావముతోనూ
బహుధా విశ్వతో ముఖమ్ - ఇట్లు అనేక విధములుగా విశ్వరూపుడగు నన్ను
ఉపాసతే- ఉపాసించుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

"మఱికొందరు జ్ఞానయజ్ఞముతో పూజించుచున్నారు,అహంబ్రహ్మాస్మి అనే అద్వైత భావముతోనూ,
బ్రహ్మమే వివిధరూపములు గలవాడను ద్వైత భావముతోనూ
ఇట్లు అనేక విధములుగా విశ్వరూపుడగు నన్ను ఉపాసించుచున్నారు." ||15||

దైవసంబంధమైన ప్రకృతిని ఆశ్రయించినవారు భగవానుని ఎలాపూజిస్తున్నారో అని చెపుతూ , ద్వైతా అద్వైత భావములను గురించి కూడా చెప్పాడు. అదే కొందరు జ్ఞానయజ్ఞముతో అద్వైతభావముతో( ఏకత్వేన) మరికొందరు ద్వైత భావముతో( పృథక్త్వేన) సర్వాత్మకుడనగు ( విశ్వముఖమ్) సేవించుచున్నారు అని.

కృష్ణభగవానుడు " నన్ను సేవించుచున్నారు" అని చెప్పి, అధ్యాయము మొదలులో చెప్పినమాట " మయా తతమిదం సర్వం "(9.04) , బ్రహ్మము చేత లోకము అంతా వ్యాపింపబడినది అన్నమాటని ముందు నాలుగు శ్లోకాలలో విశదీ కరిస్తాడు.

అంటే సర్వాతర్యామి అయిన బ్రహ్మము యొక్క స్వరూపమును ఇక్కడ వివరిస్తాడు.

శ్లోకము 16

అహం క్రతుః అహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్|
మన్త్రోఽహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతమ్||16||

స|| అహం క్రతుః| అహం యజ్ఞః| స్వధాహమహమౌషధమ్| అహం మన్త్రః | అహం ఆజ్యం | అహమ్ అగ్నిః | అహం ఏవ హుతమ్ అస్మి||16||

ప్రతిపదార్థాలు:

అహం క్రతుః- నేనే క్రతువును
అహం యజ్ఞః- నేనే యజ్ఞము
అహం మన్త్రః- నే నే మంత్రము
స్వధాహమహమౌషధమ్- నేనే పితృదేవతల కిచ్చు అన్నము ఔషధము కూడా
అహం ఆజ్యం | అహమ్ అగ్నిః - నేనే అగ్నిహోత్రమును. నేనే హోమద్రవ్యమును.
అహం ఏవ హుతమ్ అస్మి- నేనే హోమకర్మమును అయి వున్నాను.

శ్లోక తాత్పర్యము:

"నేనే క్రతువును, నేనే యజ్ఞము, నేనే మంత్రము
నేనే పితృదేవతల కిచ్చు అన్నము, ఔషధము కూడా, నేనే అగ్నిహోత్రమును. నేనే హోమద్రవ్యమును.
నేనే హోమకర్మమును అయి వున్నాను." ||16||

శ్లోకము 17

పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవచ ||17||

స|| అస్య జగతః అహమ్ ఏవ పితా మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రం ఓంకారః ఋక్ సామ యజుః అపి||17||

ప్రతిపదార్థాలు:

అస్య జగతః - ఈ జగత్తునకు
అహమ్ ఏవ పితా మాతా ధాతా పితామహః - నేను తండ్రిని, తల్లిని, రక్షకుడను,తాతను,
వేద్యం - తెలిసికొనతగిన వస్తువును,
పవిత్రం- పవిత్రమైనది,
ఓంకారః- ఓంకారమును
ఋక్ సామ యజుః అపి- ఋగ్వేద సామ వేద యజుర్వేదములను కూడా ( అయివున్నాను).

శ్లోక తాత్పర్యము:

"ఈ జగత్తునకు నేను తండ్రిని, తల్లిని, రక్షకుడను,తాతను,
తెలిసికొనతగిన వస్తువును, పవిత్రమైన పదార్థమును,
ఓంకారమును, ఋగ్వేద సామ వేద యజుర్వేదములను కూడా ( అయివున్నాను)." ||17||

శ్లోకము 18

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్|
ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయమ్||18||

స||గతిః భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణమ్ సుహృత్ ప్రభవః స్థానం ప్రళయః నిధానమ్ అవ్యయం బీజమ్ ||18||

ప్రతిపదార్థాలు:

గతిః - పరమ లక్ష్యమును
భర్తా - భరించువాడును
ప్రభుః- ప్రభువును
సాక్షీ - సాక్షియు
నివాసః శరణమ్ - నివాసమును , శరణుకోరతగినవాడను
సుహృత్- హితుడు
ప్రభవః స్థానం ప్రళయః - సృష్ఠి ,స్థితి, ప్రళయము,
నిధానం బీజమవ్యయమ్- నిధి, నాశనము లేని బీజము.

శ్లోక తాత్పర్యము:

"(నేను) పరమ లక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియును,
నివాసమును , శరణుకోరతగినవాడను, హితుడు
సృష్ఠి ,స్థితి, ప్రళయము,నిధి, నాశనము లేని బీజము (అయి వున్నాను)." ||18||

శ్లోకము 19

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ|
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున||19||

స|| హే అర్జున! అహం తపామి |అహం వర్షమ్ ఉత్సృజామి| నిగృహ్ణామి చ| అమృతం చ| మృత్యుశ్చ| అహమేవ సత్ చ | అసత్ చ ||19||

ప్రతిపదార్థాలు:

అహం తపామి |అహం వర్షమ్ ఉత్సృజామి- నేనే తపింపచేయువాడను, నేనే వర్షముకురుపించువాడను.
నిగృహ్ణామి చ| అమృతం చ| మృత్యుశ్చ- నిలుపు వాడను, అమృతమును, మృత్యువును,
అహమేవ సత్ చ అసత్ చ- నేనే సద్వస్తువును , అసద్వస్తువును

శ్లోక తాత్పర్యము

"నేనే తపింపచేయువాడను, నేనే వర్షముకురుపించువాడను, నిలుపు వాడను, అమృతమును, మృత్యువును
నేనే సద్వస్తువును , అసద్వస్తువును." || 19||

ఇదంతా పరమాత్మ స్వరూపమైనప్పటికీ, అజ్ఞానము వలన మనుష్యులు ఇది తెలిసికొనలేకపోతున్నారు.

శ్లోకము 20

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయన్తే|
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోక
మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్||20||

స|| త్రైవిద్యాః సోమపాః పూతపాపాః యజ్ఞైః మామ్ ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమ్ సురేంద్రలోకం ఆసాద్య దివి దివ్యాన్ దేవభోగాన్ ఆశ్నన్తి ||20||

ప్రతిపదార్థాలు:

త్రైవిద్యాః- మూడు వేదములు అభ్యసించినవారు,
సోమపాః - సోమ పానము చేసిన వారు,
పూతపాపాః - పాప కల్మషము లేని వారు,
యజ్ఞైః మామ్ ఇష్ట్వా - యజ్ఞములతో నన్ను పూజించి,
స్వర్గతిం ప్రార్థయంతే - స్వర్గలోకప్రాప్తిని కోరుకొనుచున్నారు.
తే పుణ్యమ్ సురేంద్రలోకం ఆసాద్య - వారు పుణ్యమైన స్వర్గలోకము పొంది,
దివి దివ్యాన్ దేవభోగాన్ ఆశ్నన్తి - స్వర్గమందు దివ్యమైన దేవభోగములను అనుభవించుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

"మూడు వేదములు అభ్యసించినవారు, సోమ పానము చేసిన వారు, పాప కల్మషము లేని వారు,
యజ్ఞములతో నన్ను పూజించి, స్వర్గలోకప్రాప్తిని కోరుకొనుచున్నారు.
వారు పుణ్యమైన స్వర్గలోకము పొంది, స్వర్గమందు దివ్యమైన దేవభోగములను అనుభవించుచున్నారు." || 20||
.

స్వర్గలోకము అనుభవించిన తరువాత ఏమిటి అవుతుంది ?అది 21 వ శ్లోకములో.

శ్లోకము 21

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి|
ఏవం త్రయీధర్మం అనుప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే||21||

స|| తే తం విశాలం స్వర్గలోకమ్ భుక్త్వా పుణ్యే క్షీణే మర్త్యలోకమ్ విశన్తి | ఏవమ్ త్రయీధర్మమనుప్రపన్నాః కామకామాః గతాగతమ్ లభన్తే||21||

ప్రతిపదార్థాలు:

తే తం విశాలం స్వర్గలోకమ్ భుక్త్వా -
వారు ఆ విశాలమైన స్వర్గలోకమును అనుభవించి,
పుణ్యే క్షీణే మర్త్యలోకమ్ విశన్తి -
పుణ్యము క్షీణించిన పిమ్మట మనుష్యలోకమునకు వచ్చుచున్నారు.
ఏవమ్ త్రయీధర్మమనుప్రపన్నాః - ఈ విధముగా వేదోక్త కర్మలను అనుసరించినవారై
కామకామాః గతాగతమ్ లభన్తే- కోరికలు కలవారు జనన్ మరణములను పొందుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

"వారు ఆ విశాలమైన స్వర్గలోకమును అనుభవించి,
పుణ్యము క్షీణించిన పిమ్మట మనుష్యలోకమునకు వచ్చుచున్నారు.
ఈ విధముగా వేదోక్త కర్మలను అనుసరించినవారై
కోరికలు కలవారు జనన మరణములను పొందుచున్నారు." ||21||

మూడు వేదములు అధ్యయనము చేసినవారు, సోమపానము చేసినవారు,పాపకల్మషము తొలగినవారు కూడా యజ్ఞములతో భగవంతుని పూజించి పుణ్యఫలము గా స్వర్గప్రాప్తిని కోరుకొని అది పొంది దేవభోగములను అనుభవించి, మళ్ళీ చేసిన పుణ్యము క్షీణించినపుడు మరల మనుష్య జన్మము పొందుచున్నారు. వారు కోరిన స్వర్గ ప్రాప్తి మాత్రమే వారికి దొరికిందన్నమాట

వేదోక్తకర్మలను అనుసరించకుండా నిర్మల భక్తి తో చేసే ఉపాసనా ఫలితము 22 వ శ్లోకములో వింటాము.

శ్లోకము 22

అనన్యాశ్చిన్తయన్తో మాం ఏ జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్||22||

స|| యేజనాః అనన్యాః మాం చిన్తయన్తః పర్యుపాసతే అహమ్ తేషామ్ నిత్యాభియుక్తానామ్ యోగక్షేమం వహామి ||22||

ప్రతిపదార్థాలు:

అనన్యాశ్చిన్తయన్తో మాం - ఇంకొకరి అలోచన/భావనా లేకుండా నన్ను,
ఏ జనాః పర్యుపాసతే - ఏ జనులు నన్ను ఎల్లప్పుడూ ఉపాసించుచున్నారో,
తేషాం నిత్యాభియుక్తానాం - ఎల్లప్పుడు నాయందే నిష్ఠ గలవారియొక్క,
యోగక్షేమం వహామ్యహమ్- యోగ క్షేమములు నేను వహించుచున్నాను.

శ్లోక తాత్పర్యము:

"ఇంకొకరి భావన లేకుండా నన్ను, ఏ జనులు నన్ను నిరంతరము ఉపాసించుచున్నారో,
అట్టి ఎల్లప్పుడు నాయందే నిష్ఠ గలవారియొక్క, యోగ క్షేమములు నేను వహించుచున్నాను." ||22||

ఇక్కడ కృష్ణుడు భక్తులకు ఒక ఆశ్వాసము అభయము హామీ ఇస్తున్నాడు.
వేదోక్త కర్మలు అనవసరము అని. కావలసినది ఒక అనన్య చిత్తమే.

అక్షరపర బ్రహ్మయోగములో చెప్పిన కఠినమైన యోగధారణకి అవసరము లేదు అన్నమాట. తనని ఆశ్రయించినవారు తనని సులభముగా పోందుతారు అని అప్పుడే విశదీకరించినా, ఈ అభయ వాక్యము మిగిలిన సందేహములు ఆన్నిటిని తొలగించుతుంది.

కృష్ణుడు ఇంకోమాటకూడా చెపుతాడు.

శ్లోకము 23

యేఽప్యన్న్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితః |
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్||23||

స|| కౌన్తేయ ! యే అపి అనన్యదేవతా భక్తా శ్రద్ధయాన్వితాః యజన్తే తే అపి మామ్ ఏవ అవిధిపూర్వకమ్ యజన్తి ||23||

ప్రతిపదార్థాలు:

యే అపి అనన్యదేవతాభక్తా - ఎవరైతే ఇతర దేవతల మీద భక్తితో
శ్రద్ధయాన్వితాః యజన్తే - శ్రద్ధతో పూజించుచున్నారో,
తే అపి మామ్ ఏవ - వారు కూడా నన్నే
అవిధిపూర్వకమ్ యజన్తి - విధి తప్పి పూజించుచున్నారు.

శ్లోక తాత్పర్యము:

"ఎవరైతే ఇతర దేవతల మీద భక్తితో శ్రద్ధతో పూజించుచున్నారో,
వారు కూడా నన్నే విధి తప్పి పూజించుచున్నారు." ||23||

శ్లోకము 24

అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ |
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే||24||

స|| హి అహం ఏవ సర్వ యజ్ఞానామ్ భోక్తా చ ప్రభుః ఏవ చ |మామ్ తే తత్త్వేన న అభిజానన్తి | అతః చ్యవన్తి ( పునర్జన్మం ఆప్నోతి) ||24||

ప్రతిపదార్థాలు:

అహం ఏవ సర్వ యజ్ఞానామ్ - నేనే సమస్త యజ్ఞములకు,
భోక్తా చ ప్రభుః ఏవ చ - భోక్తను ప్రభువును కూడా.
మామ్ తే తత్త్వేన న అభిజానన్తి - నన్ను వారు యదార్థముగా తెలిసికొనలేకపోతున్నారు.
అతః చ్యవన్తి - అందువలన జారిపోవుచున్నారు

శ్లోక తాత్పర్యము:

"నేనే సమస్త యజ్ఞములకు, భోక్తను ప్రభువును కూడా.
నన్ను వారు యదార్థముగా తెలిసికొనలేకపోతున్నారు. అందువలన ( మోక్షమార్గము నుంచి) జారిపోవుచున్నారు." || 25||

శ్లోకము 25

యాన్తి దేవవ్రతా దేవాన్ పిత్రూన్ యాన్తి పితృవ్రతాః|
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపి మామ్||25||

స|| దేవవ్రతాః దేవాన్ యాన్తి| పితృవ్రతాః పిత్రూన్ యాన్తి | భూతేజ్యా భూతాని యాన్తి | మత్ యాజినః అపి మామ్ యాన్తి ||25||

ప్రతిపదార్థాలు:

దేవవ్రతాః దేవాన్ యాన్తి - దేవతలనారాధించు వారు దేవతలను పొందుచున్నారు.
పితృవ్రతాః పిత్రూన్ యాన్తి - పితృదేవతలను ఆరాధించువారు పితృ దేవతలను పొందుచున్నారు.
భూతేజ్యా భూతాని యాన్తి - భూతములను పూజించువారు భూతములను పొందుచున్నారు.
మత్ యాజినః అపి మామ్ యాన్తి - నన్ను పూజించువారు నన్నే పొందుతున్నారు.

శ్లోక తాత్పర్యము:

"దేవతలనారాధించు వారు దేవతలను పొందుచున్నారు.
పితృదేవతలను ఆరాధించువారు పితృ దేవతలను పొందుచున్నారు
భూతములను పూజించువారు భూతములను పొందుచున్నారు.
నన్ను పూజించువారు నన్నే పొందుతున్నారు." || 25||

ఇంకా భగవానుని పూజించడానికి యజ్ఞయాగాదులు అనవసరము అని చెప్పడము 26వ శ్లోకము లో వింటాము:

శ్లోకము 26

పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి|
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః||26||

స|| యః మే భక్త్యా పత్రం ఫలం పుష్పం తోయం ప్రయచ్ఛతి (తాం) ప్రయతాత్మనః భక్త్యా ఉపహృతం తత్ (పత్రం పుష్పమ్ ఫలమ్ తోయమ్) అహం ఆశ్నామి ||26||

ప్రతిపదార్థాలు:

యః మే భక్త్యా - ఎవరు భక్తితో నాకు
పత్రం ఫలం పుష్పం తోయం ప్రయచ్ఛతి - పత్రము, ఫలము, పుష్పము,జలముగాని ఇచ్చునో
(తాం) ప్రయతాత్మనః భక్త్యా - ఆట్టి ప్రయత్నపూర్వకముగా పరమాత్మకోసము భక్తితో
ఉపహృతం తత్ అహం ఆశ్నామి - ఇవ్వబడిన దానిని నేను అనుభవించుచున్నాను.

శ్లోక తాత్పర్యము :

"ఎవరు భక్తితో నాకు పత్రము, ఫలము, పుష్పము,జలముగాని ఇచ్చునో
అట్టి ప్రయత్నపూర్వకముగా పరమాత్మకోసము భక్తితో ఇవ్వబడిన దానిని నేను అనుభవించుచున్నాను" || 26||

అంటే ఎవరైతే భక్తితో ఆకునుకాని పువ్వును కాని పండునికాని సమర్పించుచున్నాడో అట్టి భక్తిపూర్వకముగా ఇవ్వబడిన పత్రపుష్పాదులను నేను ప్రీతితో అనుభవించుచున్నాను"

అంతే కాదు భగవంతుడు అర్జునుని ద్వారా భక్తజనానికి ఇంకొక ఉపదేశమిస్తున్నాడు.

శ్లోకము 27

యత్కరోసి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్|
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్||27||

స|| కౌన్తేయ ! యత్ కరోషి యత్ అశ్నాసి యత్ దదాసి యత్ తపస్యసి తత్ మత్ అర్పణం కురుష్వ||27||

ప్రతిపదార్థాలు:

యత్ కరోషి - దేనిని చేయుచున్నావో
యత్ అశ్నాసి - దేనిని తినుచున్నావో
యత్ దదాసి - దేనిని దానము చేయుచున్నావో
యత్ తపస్యసి - ఏ తపస్సు చేయుచున్నావో
తత్ మత్ అర్పణం కురుష్వ- వానిని నాకు అర్పణము చేయుము

శ్లోక తాత్పర్యము:

"ఓ అర్జునా , దేనిని చేయుచున్నావో, దేనిని తినుచున్నావో, దేనిని దానము చేయుచున్నావో
ఏ తపస్సు చేయుచున్నావో, వానిని నాకు అర్పణము చేయుము." || 27||

ఓ అర్జునా ( ఓ భక్తులారా) నీవేది చేసినను హోమము చేసిననూ దానము చేసిననూ తపస్సుచేసిననూ దానిని నాకు అర్పింపుము " అలా భగవదార్పణములో కర్మత్యాగము ఉన్నదన్నమాట. కర్మ త్యాగముతో భవంతుని పొందడము ఒక మార్గము అని కర్మయోగము లో విశదీకరించినదే

శ్లోకము 28

శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః|
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి||28||

స|| ఏవం సన్న్యాస యోగయుక్తాత్మా శుభాశుభఫలైః కర్మబంధనైః మోక్ష్యసే | (తదా) విముక్తః మాం ఉపైష్యసి ||28||

ప్రతిపదార్థాలు:

ఏవం సన్న్యాస యోగయుక్తాత్మా- ఈ విధముగా సన్న్యాస యోగముతో
శుభాశుభఫలైః కర్మబంధనైః - శుభ అశుభ ఫలములు కల కర్మ బంధనముల నుండి,
మోక్ష్యసే- ముక్తి పొందెదవు.
(తదా) విముక్తః మాం ఉపైష్యసి - అలా విడువబడి నన్ను పొందెదవు.

శ్లోక తాత్పర్యము:

"ఈ విధముగా సన్న్యాస యోగముతో శుభ అశుభ ఫలములు కల కర్మ బంధనముల నుండి, ముక్తి పొందెదవు.
- అలా (కర్మ బంధనముల నుండి) విడువబడి నన్ను పొందెదవు." ||28||

ఇక్కడ సన్న్యాస యోగము అంటే , ముందు శ్లోకము లో చెప్పినట్లు , "యత్కరోషి.. తత్కురుష్వ మదర్పణమ్" అంటే ఏది చేస్తున్నావో అది నాకు అర్పించు అన్నమాట. ఆ భవదర్పణమే ఇక్కడ సన్న్యాసము.

శ్లోకము 29

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః|
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్||29||

స|| అహం సర్వభూతేషు సమః| మే ద్వేష్యః న అస్తి | ప్రియః న | యే తు మాం భక్త్యా భజన్తి తే మయి ( సన్తి అథ్వా వర్తన్తి)| తేషు చ అహం ( అస్మి అథవా వర్తే)||29||

ప్రతిపదార్థాలు:

అహం సర్వభూతేషు సమః- నేను సమస్త ప్రాణులయందు సమముగా వుండువాడను
మే ద్వేష్యః న అస్తి - నాకు ద్వేషింపతగిన వాడు లేడు.
ప్రియః న - ప్రియుడు లేడు.
యే తు మాం భక్త్యా భజన్తి - ఎవరైతే నన్ను భక్తితో సేవించుచున్నారో ,
తే మయి - వారు నాలో
తేషు చ అహం - వారిలో నేను.

శ్లోక తాత్పర్యము

"నేను సమస్త ప్రాణులయందు సమముగా వుండువాడను, నాకు ద్వేషింపతగిన వాడుగాని లేడు, ప్రియుడుగాని లేడు.
ఎవరైతే నన్ను భక్తితో సేవించుచున్నారో వారు నాలో, నేను వారిలో వుందుము." ||29||

శ్లోకము 30

అపిచేత్సు దురాచారో భజతే మామనన్యభాక్|
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః||30||

స|| సుదురాచారః అపి అనన్యభాక్ మామ్ భజతే చేత్, సః సాధుః ఏవ మన్తవ్యః హి | సః సమ్యక్ వ్యవసితః|

ప్రతిపదార్థాలు:

సుదురాచారః అపి - మిక్కిలి దురాచారుడైనప్పటికి,
అనన్యభాక్ మామ్ భజతే చేత్ - అనన్య భక్తితో నన్ను పూజించినచో
సః సాధుః ఏవ మన్తవ్యః హి - వాడు సాధువే అని తలంపతగిన వాడు.
సః సమ్యక్ వ్యవసితః- అతడు స్థిరమైన మనో నిశ్చయము పొందినవాడు
శ్లోక తాత్పర్యము

"మిక్కిలి దురాచారుడైనప్పటికి, అనన్య భక్తితో నన్ను పూజించినచో వాడు సాధువే అని తలంపతగిన వాడు.
ఏలయనగా అతడు స్థిరమైన మనో నిశ్చయము పొందినవాడు." || 30||

శ్లోకము 31

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి|
కౌన్తేయ ప్రతిజానీహ నమే భక్తః ప్రణశ్యతి||31||

ప్రతిపదార్థాలు:

స|| (సః) క్షిప్రమ్ ధర్మాత్మా భవతి | శాశ్వతః శాన్తిం నిగచ్ఛతి| హే కౌన్తేయ మే భక్తః న ప్రణశ్యతి ఇతి ప్రతిజానీహి||31||

(సః) క్షిప్రమ్ ధర్మాత్మా భవతి - అతడు ధర్మాత్ముడు అగుచున్నాడు,
శాశ్వతః శాన్తిం నిగచ్ఛతి- శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు,
హే కౌన్తేయ- ఓ కౌన్తేయా !
మే భక్తః న ప్రణశ్యతి - నా భక్తుడు నాశనము పొందడు .
ఇతి ప్రతిజానీహి- అని ధైర్యముగా చాటించుము.

శ్లోక తాత్పర్యము:

"అతడు ( అనన్యభక్తితో నన్ను పూజించినవాడు) ధర్మాత్ముడు అగుచున్నాడు, శాశ్వతమైన శాంతిని పొందుచున్నాడు,
ఓ కౌన్తేయా ! నా భక్తుడు నాశనము పొందడు అని ధైర్యముగా చాటించుము." ||31||

ముందు శ్లోకములో దురాచారుడైనప్పటికీ , నన్ను అనన్య భక్తితో పూజించినవాడు సత్పురుషుడే అని తలంచవలనని చెప్పిన కృష్ణుడు, అతడు ధర్మాత్ముడు అగుచున్నాడు .అంతే కాదు పరమ శాంతి ని పొందుచున్నాడు అంటే మోక్షము పొందుచున్నాడన్నమాట.

శ్లోకము 32

మాం హి పార్థ వ్యపాస్రిత్య యేఽపి స్యుః పాపయోనయః|
స్త్రియో వైశ్యాస్తథా శుద్రాస్తేఽపి యాన్తి పరాంగతిమ్||32||

స|| హే పార్థ యే పాపయోనయోః అపి స్యుః తే అపి స్త్రియః వైశ్యాః తథా శూద్రాః మామ్ వ్యపాశ్రిత్య పరాం గతిమ్ యాన్తి హి ||32||

ప్రతిపదార్థాలు:

యే పాపయోనయోః అపి స్యుః - ఎవరు పాపజన్మమును గలవారు అగుదురో
తే అపి స్త్రియః వైశ్యాః తథా శూద్రాః - వారును, స్త్రీలు , వైశ్యులు , శూద్రులు,
మామ్ వ్యపాశ్రిత్య - నన్ను ఆశ్రయించి,
పరాం గతిమ్ యాన్తి హి - సర్వోత్తమ పదమును నిశ్చయముగా పొందుతున్నారు.

శ్లోక తాత్పర్యము:

"ఎవరు పాపజన్మమును గలవారు అగుదురో వారును, స్త్రీలు , వైశ్యులు , శూద్రులు,
నన్ను ఆశ్రయించి, సర్వోత్తమ పదమును నిశ్చయముగా పొందుతున్నారు." ||32||

ఇక్కడ భగవద్గీతలో ముఖ్యమైన మాట చెప్పబడినది. మోక్షము అందరికి లభంచవచ్చు. స్త్రీ పురుష భేదము లేదు. వర్ణాశ్రమ భేదము లేదు. రాజులు రాజ భటులు కూడా భేదము లేదు.

శ్లోకము 33

కిం పునర్బ్రహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తదా|
అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమామ్||33||

స| పుణ్యాః బ్రాహ్మణాః తథా భక్తాః రాజర్షయః పునః కిమ్ వక్తవ్యమ్ | అనిత్యమ్ అసుఖమ్ ఇమమ్ లోకమ్ ప్రాప్య మామ్ భజస్వ||33||

ప్రతిపదార్థాలు:

పుణ్యాః బ్రాహ్మణాః - పుణ్యాత్ములైన బ్రాహ్మణులును
తథా భక్తాః రాజర్షయః - అలాగే భక్తులైన రాజర్షుల గురించి,
పునః కిమ్ వక్తవ్యమ్ - మళ్ళీ చెప్పవలసిన అవసరము ఏమి?
అనిత్యమ్ అసుఖమ్ - నిత్యము కాని, సుఖములేని
ఇమమ్ లోకమ్ ప్రాప్య- ఈ లోకమును పొంది
మామ్ భజస్వ- నన్ను సేవింపుము.

శ్లోక తాత్పర్యము

"పుణ్యాత్ములైన బ్రాహ్మణులును అలాగే భక్తులైన రాజర్షుల గురించి, మళ్ళీ చెప్పవలసిన అవసరము ఏమి?
నిత్యము కాని, సుఖములేని ఈ లోకమును పొంది నన్ను సేవింపుము." ||33||

శ్లోకము 34

మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః||34||

స|| మత్ మనాః మత్ భక్తః మత్ యాజీ భవ | మామ్ నమస్కురు | ఏవమ్ ఆత్మానమ్ యుక్త్వా మత్పరాయణః మామ్ ఏవ ఏష్యసి ||34

ప్రతిపదార్థాలు:

మత్ మనాః మత్ భక్తః మత్ యాజీ భవ -
నాయందు మనస్సు కలవాడవు, నాభక్తుడవు, నన్నే పూజించు వాడవు కమ్ము!
మామ్ నమస్కురు - నన్నే నమస్కరింపుము.
ఏవమ్ ఆత్మానమ్ యుక్త్వా - ఈ విధముగా మనస్సు నాలో నిలిపి,
మత్పరాయణః- నన్నే పరమగతిగా తలచినవాడై
మామ్ ఏవ ఏష్యసి - నన్నే పొందెదవు.

శ్లోక తాత్పర్యము:

"నాయందు మనస్సు కలవాడవు, నాభక్తుడవు, నన్నే పూజించు వాడవు కమ్ము! నన్నే నమస్కరింపుము.
ఈ విధముగా మనస్సు నాలో నిలిపి, నన్నే పరమగతిగా తలచినవాడై,
నన్నే పొందెదవు."|| 34||

"నాయందే మనస్సు కలవాడవు, నాభక్తుడవు, నన్నే పూజించువాడవు అగుము. నన్నే నమస్కరింపుము. ఈ విధముగా మనస్సు నాయందే నిలిపి నన్నే శరణుకోరినవాడై నన్ను పొందగలవు"

ఈ భగవంతుని సేవలో ఎక్కువ తక్కువలు లేవు ఏవరైతే భక్తితో భగవంతుని సేవించెదరో వారు భగవంతుని యందు వారి యందు భగవంతుడు ఉండును.

"అనన్యాశ్చింతయంతో మాం" అన్నది అందరికీ వర్తిస్తుంది అని చెప్పడముకోసము - దురాచారులైనా గాని అనన్యభక్తితో నిరంతరము భగవంతునే ఆరాధిస్తే వారి పాపకర్మలు నశించి సాధువులు అంటే సత్పురుషుడు అవుతాడు అన్నమాట.
ఇది అందరికీ వర్తిస్తుంది అని మరీ ఉద్ఘాటిస్తో కృష్ణుడు అంటాడు.

మోక్షము పొందే మార్గములు ఉన్నాయి. అవి విశదీకరించ బడ్డాయి. ఆ మార్గాలు కఠినమైనవి. కాని ఆన్నిటికన్న సులభమైన మార్గము కృష్ణభగవానుడు చెప్పిన, " అనన్యాః చింతయంతో మాం " అంటూ, "మన్మనాభవ మద్భక్తో" అంటూ ఉపదేశించిన మార్గమే.

అదే రాజవిద్య. అదే పరమ రహస్యము
అదే రాజవిద్యా రాజగుహ్యము.

||ఓమ్ తత్ సత్||
మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు|
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః||
"నాయందే మనస్సు కలవాడవును, నా భక్తుడవును, నన్నే పూజించువాడవు అగుము. నాకు నమస్కరింపుము. ఈ ప్రకారముగా మనస్సు నా యందే నిలిపి నన్నే పరమగతిగా ఎన్నుకొనిన వాడవై చివరికి నన్నే పొందగలవు".
|| ఓమ్ తత్ సత్ ||